భయం ఎందుకు?
రామావతార సందర్భంలో భగవంతుడు ''నేను మనుష్యుడననిన్నీ, మనుష్యులకు కలిగే సుఖదుఃఖాలు నాకు గూడా కలుగుత వనిన్నీ, వానిని అనుభవిస్తూ నన్ను ఇతరులెవరైనా స్తోత్రం చేస్తే నేను మనుష్యుడనే - ''ఆత్మానం మానుషం మన్యే'' అనిన్నీ, చెబుతూ ఉండేవారు. అదేవిధంగా శంకర భగవత్ పాదులు పరమేశ్వర - అవతారమూర్తులై వుండిన్నీ మానవ జన్మం ఎత్తినందుకు మానవుల రీతిగానే ఈశ్వరోపాసన చేస్తూ భక్తిప్రపత్తుల ఆవశ్యకతను ఇతరులకు ఉపదేశించారు.
కరలగ్న మృగః కరేంద్రభంగో
ఘనశార్తూలవిశండనో7స్త జంతుః,
గిరిశో విశదాకృతి శ్చ చేతః
కుహరే పంచముఖో స్తి మే కుతో భీః.
అని శివానందలహరిలో శివునిగూర్చి చెపుతూ ''పరమ శివుడు హృదయ కుహరంలో ఉండగా భయానికీ తావేదీ'' అని అన్నారు.
ఈశ్వరుని కుడిచేతిలో జింకపిల్ల వున్నది. జింక స్వభావం అతి చంచలం. మనుష్యుని మనస్సు కూడ అతిచంచలం. 'చంచలం హి మనః కృష్ణ' అని అర్జునుడు కృష్ణునితో విన్నవించుకుంటాడు. కాని శివుని చేతిలో చంచలమైన హరిణం మాత్రం చేష్టుడిగి చాంచల్యరహితమై యీశ్వరుని కనుల అందంలో మునిగిపోయి ఆనందిస్తుంది.
ఏనుగుతోలు కప్పుకొన్నందున శివునకు కృత్తివాసుడని పేరు. కృత్తి అంటే ఏనుగుతోలు. ఒకప్పుడు ఒక పెద్ద ఏనుగు ఈశ్వరుని ఎదిరించగా ఆయన ఊర్ధ్వతాండవం చేస్తూ దానిని కాలితో ఎగజిమ్మి కిందపడగొట్టి తిత్తొలిచి వస్త్రంగా ధరించాడట. వేదాలలో గూడా 'కృత్తిం వసానః' అని కలదు. మరొకచోట 'కృత్తివాసాః పినాకీ' అని వున్నది. సంస్కృత నిఘంటువులలోని ఈశ్వరుని వేళ్ళలో ఈ పేరు గూడా కనబడుతూంది.
నిఘంటువుకు పర్యాయ పదం కోశం. అనగా శబ్ద సముదాయాల కోశం. ఆదినుండీ అంతంవరకూ గల శబ్దసముదాయం ఇందు ఇమిడి ఉండడంవల్ల దీనిని 'ఆకారాది' అనిన్నీ అంటారు. కోశా లన్నింటిలో అమరసింహుని అమరకోశానికే ప్రశస్తి.
అమరసింహుడు, జైనుడు, మహాబుద్ధిమంతుడు. అతనికి ఎవరూ ఈడు కారు. ఇతడు ఎన్నో పుస్తకాలు రాశాడు. శ్రీ శంకరాచార్యులవారు దిగ్విజయం చేసిన సందర్భంలో అమరసింహునికిన్నీ ఆయనకున్నూ తర్కం ఒకటి జరిగింది. జైనమతంలో వేదం చెప్పని ఆచారాలు చాల వున్నవి. వారికి దైవంలేదు. బౌద్ధులకు కడకు మిగిలిన వస్తువు 'శూన్యం'. జైనులు ''ఏ వస్తువైనా ఉంటే ఉండవచ్చు, ఉండకయూ పోవచ్చు, ఉండీలేకుండానూ ఉండవచ్చు'' అని అనేకాభిప్రాయాలు ఉన్నవారు. ''ఆత్మే సర్వవ్యాపకమైన వస్తువు, పరిపూర్ణవస్తువు అని ఉపనిషత్తుల అభిప్రాయం''. వీనినన్నింటినీ పరిశీలింతామని ఆచార్యులవారు అమరసింహుని వాదానికి రమ్మన్నారు. కాని అమరసింహుడు వాదంలో ఆచార్యుల ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పలేకపోయాడు. జైనుడైనా అతడు సరస్వత్యుపాసకుడు. అందుచేత ఆమె కటాక్షించి 'నీవు నన్ను ఆవాహనచేస్తే శంకరాచార్యుల ప్రశ్నలకు నేనే బదులు చెపుతాను' అని అనుగ్రహించిందట. అందువల్ల అమరసింహుడు ఒకతెరకట్టి కలశంలోకి సరస్వతిని ఆవాహన చేశాడు. తెరముందు శంకరులను కూర్చుండ బెట్టాడు. తెరచాటున నేను కూర్చుండి బదులు చెపుతానని శంకరులతో ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కథ కొంతవరకు సాగింది. తానడిగే ప్రశ్నలకు బదులు చెప్పేది అమరసింహుడు కాదనిన్నీ, వాగ్దేవియే ప్రతివాదినిగా తయారైనదనిన్నీ శంకరులు గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు.
ఇట్టి భ్రష్టుని పక్షం అవలంబించియా నీవు నాకు బదులు చెతుతున్నావు? ఇతడు దేవుడు లేడని ప్రపంచానికి చెప్పేవాడు గదా! అని ఆయన మనస్సులో అనుకోగానే 'ఇక నేను బదులు చెప్పను' అని సరస్వతి అంతర్థానమైంది.
వాదంలో ఓడిపోయిన అమరసింహుడు ఆచార్యుల పాదాలమీద పడ్డాడు. హృదయంలో ఓటమి గాటంగా నాటుకొన్నది. తాను వ్రాసిన పుస్తకాలన్నీ అగ్నికి ఆహుతి చెయ్యగోరి ఒక్కొక్కటే అగ్నిలో పడవేయడానికి పూనుకున్నాడు. ఆదిశంకరులకు ఇది తెలియరాగా వారు అతనిని మందలించి 'ఏ మతానికి చెందినవాడ వైతేనేమి నీవువ్రాసిన గ్రంథాలు గొప్పవి, వీనిని ఎందుకు తగలపెడతావూ? అని నివారించారు. కడపటకు మిగిలినది ఒక్క అమరకోశ##మేనట. ఇది ఒక కథ.
సంస్కృతంలో రఘువంశం, నైషథం, మాఘం, కిరాతార్జునీయం, కుమారసంభవం అనేవి పంచకావ్యాలు. తమిళంలో గూడా చింతామణి, విలైయాపతీ అనేవి జైనగ్రంథాలు. వీని తరువాతనే చోళరాజు శివభక్తుడై అరవైమూడు నాయనార్ల (శివభక్తుల) చరిత్రయైన పెరియ పురాణం (పెద్దపురాణం) వ్రాయమని నియోగించాడు. జైనగ్రంథాలే తమిళంలో తొలుతటివి.
అమరసింహుడు జైనుడైనా వైదికగ్రంథాలలోని పదాలకు సరియైన అర్థమే చెప్పేడు. కాని బౌద్ధమత ప్రశంస తగిలేసరికే బుద్ధునికి చెందిన పదాల నన్నిటినే జినునకు కూడా అన్విత మయ్యేటట్లు వ్రాశాడు. మనస్తాపాలూ జగడాలూ దూరమునందున్న వారితో ఏర్పడవు. కస్సు బుస్సులన్నీ దాపున ఉన్నవారితోనే. జైనబౌద్ధాలు అప్పా సెల్లెండ్రు గనుక బౌద్ధంపట్ల మాత్రం అమరసింహుని నిష్పాక్షిత నిలువజాలక పోయింది. బుద్ధునికి తథాగతుడని పేరు. కాని అమరకోశంలో తథాగతనామం జిననామాల పట్టికలోకి పోయింది. ఇదేకాదు, ప్రసిద్ధుడయిన బుద్ధుని అంగరక్షకుడు సుగతుడు. ఇతని పేరు కూడా జినపర్యాయాలలో చేరిందా. ఇదిన్నీ పక్షపాతమే. కాని వైదికమతానికి సంబంధించిన పేళ్ళలో మాత్రం అమరసింహుడు ఇంచుకయినా పక్షపాతం లేకుండా ఈశ్వరుని పేళ్ళలో ఒక్కదానిని గూడా వదలకుండా వ్రాశాడు.
శంభు రీశః పశుపతిః శివః శూలీ మహేశ్వరః,
ఈశ్వరః శర్వీశానః శంకర శ్చంద్రశేఖరః.
భూతేశం శండపరశు ర్గిరీశోగిరితో మృడః,
మృత్యుంజయః కృత్తివాసాః పినాకీ ప్రమథాధిపః.
అని వేదాలలోనూ పురాణాలలోనూ గల పదాలన్నిటినీ పేర్కొన్నాడు. వేదంలోని కర్మకాండలో ఈశ్వరనామాలు బహుళం. 'కృత్తివాసః పినాకీ' అని అమరములో ఉన్న పదాలు వేదంలోనూ ఆయుష్యహోమంలోనూ ఉన్నవి.
ఏనుగు చర్మం ఒలిచి పైన తాల్చుట యీశ్వరుడు తానొక వస్తాదని చెప్పుకొనుటకా? 'శ్రీకృష్ణుల వారు కూడా ఏనుగునూ, కొంగనూ చంపారు అని అంటారుకదా. దానివలన శ్రీకృష్ణభగవానునకువలెనే తనకుగూడా ఏ మాత్రమో పేరు రావాలనా? కాదు, ఈ యేనుగు భౌతికమయిన యేనుగుకాదు.
ఒకప్పుడు ఋషు లందరూ 'వేదోక్తాలయిన కర్మలను అనుష్టిస్తే చాలు. ఈశ్వరధ్యానం. ఈశ్వరభక్తి ఇవి ఏమీ అక్కరలేదు' అనే అహంభావంతో ఉన్నారు. 'మనకు వేదోక్తమైన కర్మానుష్ఠానం వున్నది. అదే ఫలం ఇస్తుంది, దీనికి మిగిలిపోయిన యీశ్వరు డెక్కడ ఉన్నాడు? ఆయన యెడల భక్తి స్వరూపధ్యానమూ మన కెందుకు?' అని అనుకొన్నారట.
ఈ విషయాన్ని గురించే మండన మిశ్రులకున్నూ శంకరులకున్నూ వాదం పడ్డది. మండనమిశ్రులు ఓడిపోయారని శంకర విజయంలో చదువుతున్నాం. వట్టి కర్మలను మాత్రం చేస్తూ తత్త్వం విచారణ చేయకపోతే ప్రయోజనంలేదు. ఉపనిషత్తుల ముఖ్యప్రయోజనం తత్త్వవిచారణమే.
'త్రైగుణ్యవిషయా వేదా నిసై#్త్రగుణ్యో భవార్జున.'
అని గీతలో భగవంతుడు చెప్పాడు. వేదాలు త్రిగుణాలకు సంబంధించినవి. ఈ త్రిగుణాలనూ సాధనంగా తీసుకుని వానిని అతిక్రమించడమే వేదముల ప్రయోజనం. వేదాలు చెప్పిన కర్మలు చేస్తూ త్రిగుణాలలో చిక్కుకొని ఉండడంచూసి 'అన్నిటినీ ఈశ్వరార్పణం చేస్తే గుణాతీతుడవు అవుతావ' ని గీతలలో భగవానులు చెప్పారు. శుష్కమయిన కర్మానుష్ఠాన మే బుద్ధిమంతుని పనికాదు. కర్మలనుమాత్రం నమ్ముకొన్నవారికి బుద్ధి లేదనిన్నీ వారిబుద్ధి హోమధూమంవలె మాయమయి పోతుందనిన్నీ వేదాలే చెపుతున్నవి. అందు 'నిసై#్త్రగుణ్యో భవార్జున!' అని సత్త్వ రజస్తమో ధర్మాలను అతిక్రమింప మని కృష్ణపరమాత్మ ఉపదేశించడం.
ఈ వేదాలన్నీ ఎవరి చరణార విందాలను వెతకి గమ్యం చేరి ఎచట నిలిచిపోతున్నవో ఆ పాదార విందాలే నీవు పోయి చేరదగిన తుది అని కఠం.
'కేవలం వైదికకర్మలు చేస్తూ ఈశ్వరుని తెలిసికొననివాడు నిప్పులో కట్టెలు వేసి పొగపెట్టిన వాడవుతాడు. వా డేనాటికినీ ఆత్మస్వరూపం తెలిసికోలేడు' అని శ్రుతిలోని కర్మకాండ లోనే ఉంది.
'ఆత్మస్వరూపం తెలిసికొన్న తరువాత అతనికి వేదాలతో పనిలేదు. బ్రాహ్మణులతోనూ పనిలేదు. దేవతలతోనూ పనిలేదు'. అని బృహదారణ్యకం నాలుగో అధ్యాయంలో ఉంది.
ఇట్లా 'వేదాలతో పనిలేదు' అని చెప్పడానికి కారణమేమిటి?' 'అన్నిటికి మూలమయిన వస్తువేదో ఆ వస్తువు వేరు; మనము వేరు అన్న భేదబుద్ధి లేక జ్ఞానులు ఆ వస్తువుతో కలిసి పోతారు. అదీకారణం. శంకరులకూ మండన మిశ్రులకూ జరిగిన వాదంలో తేలిన సారాంశమూ శ్రీకృష్ణభగవానులు గీతలలో 'నిసై#్త్రగుణ్యో భవార్జున' అని చెప్పినదిన్నీ పైన చెప్పిన కారణమున్నూ ఒకటే. ఎవరికయినా మరపు కలిగితే దారుకావన తాపసులకువలె ఈశ్వరలీల యీవిషయాన్ని మళ్లా గుఱుతు రప్పిస్తుంది.
దారుకావనంలోని తాపసులు 'వేదచోదితాలయిన కర్మల, ననుష్టిస్తేచాలు, ఈశ్వరునితో పనిలేదు' అని అహంకారవిమూఢులై ఉన్నారు. ఈ సంగతి పసికట్టగానే వారికి జ్ఞానం కలిగించవలెనని ఈశ్వరుడు బిచ్చగాని వేషం వేసికొని బయలుదేరాడు. ఆ వేషం చూస్తే చాలు, ఎవరయినా సరే వశమయి పోవలసినదే. అంత జగన్మోహనంగా ఉంది ఆ వేషం. భిక్షాపాత్ర పుచ్చుకుని ఈశ్వరుడు ఋష్యాశ్రమంలో ప్రవేశించాడు. ఆ వేషమును చూచిన ఋషుల భార్యలు నేనూ నాదీ అనేది మరచి స్వరూపానందంలో మునిగి ఆయన వెంట బడ్డారు.
'నాదీ' అని అనుకొన్న చోటనే అందరకూ ప్రీతి. మన తలిదండ్రులమీద ప్రేమకు కారణం ఏమిటి? వారు 'మన' కావడమే. ఆ ప్రీతి మనవారు కాని వారిమీద ఉండదు. 'నేను నేను' అనే అభిమానం చాలా ప్రియం. ఇది కట్ట కడపటి ఆత్మస్వరూపంలో లయ మవుతుంది. భగవానుడే అందరకూ ఆత్మస్వరూపుడు. కృష్ణభగవానుని వెంటనంటిన గోపికలవలె వశీకరణ చక్రవర్తి యయిన భిక్షాటనమూర్తిని చూచీ చూడంగానే అహంకారం నశించి-నేను అనే బుద్ధిపోయి-భర్తల శుశ్రూషా హోమద్రవ్యసంచయమూ ఈ మొదలయినవాని నన్నిటినీ మరచి ఋషిపత్నులు ఆ భిక్షాటన మూర్తి వెంట పోవడం ఆరంభించారు.
కర్మానుష్ఠాతలయిన ఋషిచక్రవర్తులకు భిక్షాటన చక్రవర్తిమీద కోపం ఉబికింది - 'ఈ బిచ్చగా డెవడు? శూన్యం పెట్టే వానిలాగా ఉన్నాడు. మన యిల్లాండ్రను మోహపెట్టి వశం చేసుకొని తన వెంట వేసుకొని పోతున్నాడే!' అని ఆయనను ఎదిరింప బూనుకొన్నారు. వీరి శక్తి ఈశ్వరుని ముం దెంతటిది? రోషలతో అభిచారిక క్రతువులు ప్రయోగాలు ఎన్నో చేశారు. మత్తగజాన్ని ఒకదాన్ని సృష్టించి ఆయనమీదికి పురికొల్పారు. ఋషులు అహంకార స్వరూపమో అని అనుకోదగిన ఆ మదగజం ఘీంకరిస్తూ ఈశ్వరునిపై కవిసింది. వెంటనే ఆ ఈశ్వరుడు ఊర్థ్వతాండవం చేస్తూ దానిని బంతిలాగా ఆకాశంలోనికి ఎగజిమ్మి ఛిన్నాభిన్నంచేసి దాని తోలు ఒలచి వలువలాగా కప్పు కొన్నాడు. అటుమీద ఋషులకు జ్ఞానోదయమై భక్తులై సద్గతి పొందా రని ఒక కథ.
'కరలగ్నమృగః కరీంద్రభంగో
ఘన శార్దూల విఖండనో7స్తజంతుః'
ఎప్పుడూ బెదురుకన్నులతో జింకపిల్ల యీశ్వరుని కన్నుల సొగసును అదేపనిగా చూస్తున్నది. పులి అంటే అందరకూ భయమే. కాని యీశ్వర సమక్షంలో పులిభయం మరచి పోయింది ఆ జింకపిల్ల.
సృష్టి స్థితి సంహారాలకు అధికర్త యీశ్వరుడు. ప్రాణు లందరకూ ప్రాణంగా ఉండేది అతడే. ఆయనలోనే చరా చరాలయిన ప్రపంచా లన్నీ అణగుతవి.
'గితిశో విశదాకృతి శ్చ చేతః
కుహరే పంచముఖో7స్తి మే కుతో భీః?'
ఈశ్వరునికి అయిదు ముఖాలు. నాలుగు ముఖాలయందూ నాలుగు వేదాలూ వారి నిట్టూరుపు రూపుగా ఉన్నవి. ఊర్ధ్వముఖంతో ఆ యీశ్వరుడు ప్రణవమును ఉద్‌ఘాటిస్తాడు.
ఏనుగుతోలు ఆయనకు పచ్చడం, నడుముమీద పులితోలు, చేతిలో జింకపిల్ల, ఈ లక్షణా లెట్లావున్న వంటే; గుహలోని ఒక సింహం ఒక జింకను లంకించుకుని గోళ్ళతో పులిని చీల్చి ఏనుగు కుంభస్థలం వ్రయ్యలు చేసి దాని చర్మం పైన వేసికొన్నటులు ఉంది. ఆ కృత్తివసానుడు మనకు స్వాధీనుడయితే భయానికి తావేది?
కుహరే పంచముఖో7స్తి మే కుతో భీః?
పంచముఖపదం ఈశ్వరునికిన్నీ సింహానికిన్నీ పేరు. వ్యాకరణ శాస్త్రరీత్యా పంచ అంటే విశాలం విస్తారం అని అర్థం. విశాలమయిన ముఖము మాత్రము ఉన్నదిగాని దానికి తగిన దేహం లేకపోవడాన సింహాన్ని పంచముఖం అని అంటారు. పయిభాగం వెడలుపుగా క్రిందిభాగంచిన్నదిగా ఉండడమువలన సంధ్యావందనాదులకు మన ముపయోగించే పాత్రకు పంచపాత్రము అనిపేరు. 'కుహరే పంచముఖో7స్తి మే కుతో భీః?' అని అనడంలో గుహలో సింహం ఉంటే భయమేమి? అని ఒక అర్థం. 'మృదయకుహరంలో దహరాకాశంలో ఈశ్వరుడుండగా నా కేమి భయం?' అని మఱొక అర్థం. 'కుతో భీః' అని శంకరులు శివానందలహరిలో అన్నారు. ఆదిశంకరులే ఈశ్వరావతారం. మన భయం పోగొట్టడానికే వారి అవతరణ. ఉపదేశార్ధం తామే భీతి పొందిన చందంగా వ్యవహరించారు.
శంకరుల దయాస్రవంతిలోని తరంగమే ఈ శివానందలహరి. మన కష్టాలూ దుఃఖాలూ భీతీ పోగొట్టేది స్వామి. అట్టి స్వామిని హృదయంలో ధ్యానిస్తే భయనివృత్తీ మృత్యుని వృత్తీ కలుగుతవి. అపుడు ఆచార్యులవారితోపాటు మనమున్నూ 'కుతో భీః' 'భయ మెందుకు?' అని గుండెమీద చేయివేసి మరీ అనగలం.
|